ముంబై: ఇండియన్ రోడ్లపై 90వ దసకం వరకు రారాజులా వెలిగిన కారు అంబాసిడర్. బిర్లా ఫ్యామిలీకి చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ అప్పట్లో ఈ కారును మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టగానే ట్యాక్సీ డ్రైవర్ నుంచి సెలబ్రిటీల వరకు అందరిని ఆకట్టుకుంది.
దాదాపు 90వ దశకం చివరి వరకు భారత సినిమాలన్నింటిలోనూ ఈ కారే కనిపించేది. అంబాసిడర్ అంటే ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలూ చాన్నాళ్ల పాటు అంబాసిడర్‌నే వాడే వారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగయింది.
కాగా ఇటీవల పాత అంబాసిడర్‌కు కొత్తగా ఎలక్ట్రిక్ హంగులు అద్ది మార్కెట్‌లోకి తెస్తామంటూ హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ప్రకటన చేసింది. పాత కాలం అంబాసిడర్‌ను కొత్త లుక్‌లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్ మీద ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.
గత నెల మే 24వ తేదీన హిందూస్థాన్ మోటార్స్ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్ అంబాసిడర్ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు.
కాగా ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఈ ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడినట్లు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్ మోటార్స్ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకెళ్ళాయి.