దెబ్బ మీద దెబ్బ – దిల్ రాజుపై ఐటీ దాడులు – చిత్ర పరిశ్రమలో కలకలం
నిర్మాతకు భారీ షాక్
తెలంగాణ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజుపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మెరుపు దాడులు జరిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసం, కార్యాలయాలతో పాటు నగరంలోని మరో అనేక ప్రదేశాల్లో ఏకకాలంలో ఈ దాడులు చేపట్టారు.
ఐటీ దాడులు
ఈ సంక్రాంతి పండగకు విడుదలైన మూడింట రెండు భారీ చిత్రాలు ‘గేమ్ ఛేంజర్’ మరియు ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిర్మాత దిల్ రాజు. వీటిలో గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మరోవైపు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మంచి కలెక్షన్లతో విజయవంతమైంది. ఏదేమైనప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే చూపుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో అనుమానాలు రావడం ఐటీ దాడులకు దారితీసినట్లు తెలుస్తోంది.
తనిఖీలలో స్వాధీనం
ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలలో కీలకమైన ఆర్థిక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది ప్రదేశాల్లో జరిగిన ఈ దాడులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల వరకు విస్తరించాయి.
చిత్ర పరిశ్రమలో కలకలం
ఇటీవల సంక్రాంతి విడుదలలపై పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిత్ర పరిశ్రమలో ఈ పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. దిల్ రాజు తరపున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ప్రభావిత ప్రాంతాలు
దాడులు జరిపిన ప్రాంతాలు అన్ని ప్రముఖ నివాస, వాణిజ్య కేంద్రాలు కావడం విశేషం. పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు సంబంధించి మరిన్ని దాడులు కూడా జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.