ముంబై: ఆర్హిక సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ పరిశ్రమకు కరోనా వైరస్ నుండి మరింత దెబ్బ తగిలింది. కరోనా వల్ల లాక్డౌన్ కాలంలో అమ్మకాలు నిలిచిపోవడంతో ఆదాయాలు క్షీణించి కుప్పకూలాయి. దీనివల్ల హోండా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హోండా తన రెండు ప్లాంట్లలో ఒకదానిలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్ వద్ద హోండా వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది.
అలాగే గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తయారయ్యే హోండా పాపులర్ కార్లు హోండా సివిక్, సీఆర్-వీ కార్లు ఇకపై భారత్ లో లభించవని తెలిపింది. ఈ కార్ల కోసం భారీ పెట్టుబడి అవసరం కనుక ఈ రెండు కార్లను నిలిపివేయాలని నిర్ణయించింది. బహుల జనాదరణ పొందిన హోండా సివిక్ ,హోండా సీఆర్-వీరెండు గ్లోబల్ మోడల్స్‌ను నిలిపివేయడం తమకు చాలా కఠినమైన నిర్ణయం అని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ,డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ పేర్కొన్నారు.
రాబోయే 15 సంవత్సరాలకు ఈ రెండు కార్ల యజమానులకు అన్ని విధాల తమ సహాయ సహకారాల్ని అందిస్తామని అన్నారు. తాజా నిర్ణయంతో హోండా పోర్ట్‌ఫోలియోలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ, సబ్-4 ఎమ్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.