అమరావతి: తల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్ కీ కహానీ ఎలా అవుతుంది? – షర్మిల
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఆయన సోదరి వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, కన్నతల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిని కోర్టుకు లాక్కోవడం “ఘర్ ఘర్ కీ కహానీ”గా ఎలా మారుతుంది అని షర్మిల మండిపడ్డారు.
కంటతడి పెట్టుకున్న షర్మిల – సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిపై ఆగ్రహం
మీడియా సమావేశంలో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తూ, సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అని, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని ఆరోపించారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డిలో నిజాయతీ లేదని వ్యాఖ్యానించారు. వారి పేర్లు ప్రస్తావించడం ద్వారా తల్లి విజయమ్మకు కూడా ఈ విషయాలు తెలియాలని షర్మిల అన్నారు.
ఐదేళ్లపాటు ఎంవోయూ పత్రాలు నా వద్దే ఉంచుకున్నా – షర్మిల
ఐదేళ్లుగా ఎంవోయూ పత్రాలు తన దగ్గర ఉన్నా వాటిని వాడుకోలేదని షర్మిల అన్నారు. వైఎస్ కుటుంబం ప్రతిష్టకు చెడ్డపేరు రాకూడదని ఆ పత్రాలను దాచినట్టు చెప్పారు. తల్లిని కోర్టుకు లాగడం వెనుక కారణం ఏమిటో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. తనకు లాభం ఉందని అనుకుంటే జగన్ ఎవరినైనా వాడుకుంటారని, లాభం లేదని అనుకుంటే అణచివేస్తారని మండిపడ్డారు.
జగన్ కోసం పాదయాత్ర – త్యాగాల గుర్తింపు లేకపోవడం పట్ల నిరాశ
“జగన్ పాలనకు పునాది వేసేందుకు తాను మరియు తల్లి ఎంతో కష్టపడ్డామని, 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కూడా ఈ మద్దతుకు గుర్తింపు ఇవ్వడం లేదు” అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కోసం తాను చేసిన త్యాగాల గురించి వైసీపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “జగన్‌కి మంచిగా ఉండేందుకు నేను ఎన్నో పనులు చేశాను; నా కోసం ఆయన ఏమైనా చేసారా?” అని షర్మిల నిలదీశారు.
జగన్ నాయకుడా లేక శాడిస్టా – వైసీపీ శ్రేణులు ఆలోచించాలి
తనకు లాభం ఉందని అనుకుంటే జగన్ ఎవరినైనా వాడుకుంటారని, తనకు లాభం లేదని అనుకుంటే ఎవరినైనా అణచివేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో, శాడిస్టో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆలోచించాలని షర్మిల కోరారు.