ఏటీఎం నుంచి హఠాత్తుగా చిరిగిన నోట్లు వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. ATM నుంచి వచ్చిన నోట్లలో చిరిగినవి ఉంటే, మీరు వాటిని సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌లో మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, బ్యాంకులు చిరిగిన నోట్లను మార్చడానికి నిరాకరించవు. ఇక తప్పనిసరి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే, ఏటీఎం నుంచి డబ్బు తీసుకున్న తేదీ, సమయం, ఏటీఎం వివరాలతో ఫారం నింపి, ఆయా వివరాలను బ్యాంకుకు అందిస్తే మీ చిరిగిన నోట్లు మార్పిడి చేయబడతాయి.
కేవలం, ATMలో వచ్చిన నోట్లు మాత్రమే కాకుండా, మీరు ఏ ఇతర చోట్ల ఉన్న చిరిగిన లేదా పాడైన నోట్లు కూడా సులభంగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలు లేదా ఇతర నేషనల్ బ్యాంకుల బ్రాంచ్‌లలో ఈ నోట్లను మార్చుకోవడానికి వీలు ఉంటుంది. అయితే, ఒక సారి గరిష్టంగా 20 నోట్ల వరకు లేదా రూ.5000 విలువ ఉన్న నోట్లను మాత్రమే మార్చుకోవడానికి పరిమితి ఉంది. పైగా, ఆ నోట్లపై ముఖ్యమైన వివరాలు స్పష్టంగా ఉండాలి.
రాష్ట్రంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆధునిక నోట్ సార్టింగ్ మెషీన్ల ద్వారా నోట్ల నాణ్యతను నియంత్రిస్తుంది. ఈ కారణంగా, ఆ బ్యాంక్ ఏటీఎం ద్వారా చిరిగిన లేదా పాడైన నోట్ల వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఒకవేళ మీరు ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు తీసుకుంటే, వాటిని సులభంగా మార్చుకోవడం కష్టమేమీ కాదు.