తెలంగాణ: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో శుక్రవారం మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతల సమావేశం ఏర్పాటుచేయడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కావాలని నిర్ణయించగా, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు ప్రకటించారు.
గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, బారికేడ్లు ఏర్పాటు చేసి సభకు వచ్చే కార్యకర్తలను అడ్డుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.
మేడ్చల్ జిల్లా నేతలను ముందస్తుగా అరెస్టు చేసి హౌస్ అరెస్టులో ఉంచడం కూడా ఉద్రిక్తతలకు కారణమైంది. బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపుల అంశంలో గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో గాంధీ అనుచరులు కౌశిక్ ఇంటిపై దాడి చేయడం, దానిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ వద్ద హరీశ్ రావు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఆందోళనకు దిగడం గమనార్హం.
గురువారం రాత్రి గాంధీ, కౌశిక్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో, శుక్రవారం ఉదయం కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వస్తానంటూ సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఉద్రిక్తతలు శేరిలింగంపల్లిని మరోసారి రణరంగంగా మార్చాయి. గాంధీ, కౌశిక్ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి, కార్యకర్తలు, పోలీసులు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో లాఠీఛార్జ్ జరిగింది.