ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మఢ్ అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమై, గంటల పాటు కొనసాగింది. ఎన్‌కౌంటర్ స్థలం నుండి భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని, నక్సల్స్‌కు చెందిన 14 మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఇప్పటికీ ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
ఇంతవరకు 2024లో బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 171 మంది మావోయిస్టులు మట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. నక్సలైట్లు అబూజ్‌మడ ప్రాంతంలో సంచరిస్తున్నారని అందిన సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారని తెలిపారు.
నక్సలైట్ పేరుతో వసూళ్లు: ఒకరు అరెస్ట్
ఇక తెలంగాణలోని వనపర్తి జిల్లాలో నక్సలైట్ పేరుతో ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి మాజీ నక్సలైట్ అని చెప్పుకొని, ఒక వ్యక్తిని బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇప్పటికే ఘటనా స్థలంలో నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, ఇంకా సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. నక్సల్స్ రహస్య స్థావరాలను సమూలంగా ధ్వంసం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది.