జాతీయం: ఛత్తీస్‌గఢ్ లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
కోటి రివార్డు ఉన్న నేత..
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కీలక నేత చలపతి మరణించారని పోలీసులు ప్రకటించారు. చలపతి అసలు పేరు జయరాం, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న అతడిపై ఇప్పటికే కోటి రూపాయల రివార్డు ఉంది.
గరియాబండ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎదురుకాల్పులు
ఒడిశా బార్డర్‌కు సమీపంలోని గరియాబండ్ జిల్లా కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతాబలగాలు సోమవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో, కాల్పులు చోటుచేసుకున్నాయి.
పోలీసుల కాల్పుల్లో 14 మావోయిస్టులు మృతి
ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో చెట్లు, పొదల మధ్య నుంచి మృతదేహాలను పోలీసులు గుర్తించి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చలపతి మృతితో మావోయిస్టులకు తీవ్ర నష్టం
మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్న తరుణంలో, చలపతి వంటి కీలక నేత మృతి వారికే కాదు, మొత్తం మావోయిస్టు ఉద్యమానికే పెద్ద నష్టమని భావిస్తున్నారు.
భారీ డంప్
ఎన్‌కౌంటర్ స్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్‌ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం పూర్తి పరిశీలన తరువాత, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మావోయిస్టు కదలికలపై పటిష్ఠ నిఘా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు కార్యకలాపాలు జరుపుతున్న కీలక వ్యక్తులపై భద్రతాబలగాలు పటిష్ఠమైన నిఘా ఉంచాయని, ఈ విజయం దానికి నిదర్శనమని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.