మావోయిస్టులకు భారీ షాక్ – ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది లొంగుబాటు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ (Bijapur) జిల్లాలో 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగుబాటు చేసినవారిలో 10 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిలో 14 మందిపై మొత్తం రూ. 68 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎస్పీ సమక్షంలో లొంగుబాటు
బీజాపూర్ జిల్లా ఎస్పీ సమక్షంలో ఈ మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా వచ్చి లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “మావోయిస్టులు తమ గత చర్యలను పశ్చాత్తాపంతో వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు” అని పేర్కొన్నారు.
భద్రతా బలగాల కీలక పాత్ర
ఈ మావోయిస్టుల లొంగుబాటులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) కీలకంగా వ్యవహరించాయి. భద్రతా బలగాల దాడులతో ఒత్తిడికి గురైన మావోయిస్టులు, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలను విశ్వసించి లొంగిపోయారని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పునరావాస పథకాలు
లొంగిపోయిన ప్రతి ఒక్క మావోయిస్టుకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని, వారి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.