హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు మెట్రో నిర్వాహకులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవాలనే ఉద్దేశంతో కాలుష్యరహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఈవీ వాహనాలు మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ఈ కొత్త సేవలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులు తమ ఇళ్లకు, కార్యాలయాలకు లేదా విద్యా సంస్థలకు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్‌లు లేక సొంత వాహనాలను వినియోగించాల్సిన అవసరం ఇకపై ఉండదని మెట్రో అధికారులు వెల్లడించారు.
మెట్రో స్టేషన్‌లోనే ఈవీ వాహనాలు అందుబాటులో ఉంటాయని, రద్దీ సమయాల్లో కూడా ఈ సేవలు ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటాయని చెప్పారు.
ఇక మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు సయోధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఈ శిక్షణ ద్వారా మహిళలు మెట్రో ఈవీ సేవలలో నడిపించే వాహనాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు మహిళలకు శిక్షణ ఇచ్చారని, భవిష్యత్తులో వంద మందికి ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి మృదులత వెల్లడించారు.