హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ కు మహరాష్ట్ర లోని ముంబైకు మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం తాజాగా బిడ్లని పిలిచారు. దేశంలో హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ఈ బిడ్లను ఆహ్వానించింది.
ఇందుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నవంబర్ 5న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నవంబర్ 11 నుంచి టెండర్ పత్రాల దాఖలు ప్రారంభం కానుంది. నవంబర్ 17తో టెండర్ల దాఖలు గడువు ముగుస్తుంది. 18న డీపీఆర్ తయారీ సంస్థను ఎంపిక చేస్తారు.
హైదరాబాద్ నుంచి ముంబైకి, పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్ రైల్ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
తొలి బుల్లెట్ రైల్ కారిడార్ ముంబై– అహ్మదాబాద్ మధ్య సిద్ధమవుతోంది. 459 కి.మీ. నిడివి ఉన్న ఢిల్లీ–అమృత్‌సర్–చండీగఢ్, 865 కి.మీ. పొడవైన ఢిల్లీ–వారణాసి, 753 కి. మీ. దూరం ఉండే ముంబై– నాగ్‌పూర్, 886 కి.మీ. తో రూపొందే ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గాలను హై స్పీడ్ కారిడార్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్–చెన్నై సెమీ హైస్పీడ్ కారిడార్లకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. ఇందు లో రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే అని అందులో స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నారు.