స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (40), క్లాసెన్ (37), ట్రావిస్ హెడ్ (28) రాణించారు.
అనంతరం ఛేదనలో ముంబయి నిలకడగా ఆడింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (31), విల్ జాక్స్ (36) మంచి ఆరంభం ఇచ్చారు. మధ్యలో రోహిత్ శర్మ (26), సూర్యకుమార్ (26), హార్దిక్ పాండ్య (21) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3, మలింగ 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీసారు.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో మొదటిగా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కానీ మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడం, స్కోరు వేగం తగ్గడం జట్టుకు తీవ్రంగా ప్రభావం చూపింది. చివర్లో అనికేత్, కమిన్స్ సిక్స్‌లతో స్కోరు 160 దాటింది.
ముంబయికి ఇది వరుసగా రెండో విజయం కాగా, హైదరాబాద్ ఐదో ఓటమిని చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలపై ఈ పరాజయం ప్రభావం చూపే అవకాశం ఉంది.