తెలంగాణ: హైడ్రా కమిషనర్ హాజరుకావాలి: హైకోర్టు ఆదేశం
తెలంగాణలో “హైడ్రా” అనే పదం వినగానే ఇప్పుడు చెరువులు, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినవారి నిర్మాణాలను హైడ్రా అనే ప్రత్యేక విభాగం కూల్చివేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దాని అమలుకు ప్రత్యేక పోలీసు బృందం, సిబ్బందిని కేటాయించారు. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కూడా ఇవ్వడంతో, అక్రమ కట్టడాలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటున్నారు.
వారాంతంలో హైడ్రా ఊపు:
వీకెండ్స్ అంటే చాలు, హైడ్రా చేపడుతున్న రచ్చ చూస్తుంటే ప్రజల భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేదల ఇళ్ళపై హైడ్రా ప్రతాపం చూపుతోందని బాధితులు గళమెత్తుతున్నారు. డబ్బున్నవారికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని, కానీ పేదల ఇళ్ళను కూల్చివేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో కష్టపడి, లోన్‌లతో ఇళ్లు కట్టుకున్న తమ జీవితాలు అగాధంలో పడుతున్నాయని, ఆవేదనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.
అమీన్‌పూర్ వివాదం:
తాజాగా అమీన్‌పూర్‌లో కోర్టు పరిధిలో ఉన్న కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, హైడ్రా అధికారులు ఒక భవనాన్ని కూల్చివేశారు. బాధితుడు ఈ విషయాన్ని అధికారులు ముందుగానే తెలియజేసినా, వారు పట్టించుకోకపోవడంతో, బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కూల్చివేతలపై హైడ్రాను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొడతారా? అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని సంగారెడ్డి అమీన్‌పూర్ వాసి వేసిన పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్27) హైకోర్టు విచారించింది.
తన ఆస్పత్రిని కూల్చి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.దీనిపై సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఫిజికల్‌గా లేదా వర్చువల్‌గా సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని కోరింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని ఆదేశించింది.
సమస్యను పరిష్కరించాల్సిన అవసరం:
అధికారాలు తప్పుగా ఉపయోగించి పేదలపై ఎక్కువగా వత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో సామాన్యుల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీయొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.