హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతల వివాదంపై వస్తున్న విమర్శలపై ఆయన తన స్థానం స్పష్టంగా తెలియజేశారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం జరుగదని, ప్రభుత్వ విధానం ఇందుకు అనుగుణంగానే ఉంటుందని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ సహా విపక్షాలు హైడ్రా కూల్చివేతలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నిర్వాసితులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గతంలో అనుమతులు ఉన్న భవనాలను కూల్చివేయకుండా హైడ్రా ప్రాజెక్ట్ సాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మెట్రో రైలు విస్తరణను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఓఆర్ఆర్‌ను నిర్మించామన్న ఆయన, ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి కొనసాగుతున్నామని అన్నారు.