తెలంగాణ: హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నా, వీటి ప్రభావం పేదలపైనే ఎక్కువగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, సంపన్నుల నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
హైదరాబాద్ మీరాలం ట్యాంకు పరిసరాల్లో కట్టిన ఇళ్లను తొలగించాలని రాజేంద్రనగర్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు హైడ్రా చర్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది.
“సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? పేదల ఇళ్లు కూల్చే ముందు అదే ధోరణి వేరే నిర్మాణాలకు ఎందుకు ఉండదు?” అని కోర్టు నిలదీసింది.
హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా విధానంపై తీవ్ర చర్చ మొదలైంది. సమాన న్యాయం పాటించాలంటే, అన్ని అక్రమ నిర్మాణాలపై ఒకే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. పెద్దల బిల్డింగులు తప్పించుకొని, పేదల ఇళ్లే లక్ష్యంగా మారడమా? అనే ప్రశ్న ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.