హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) మళ్లీ దూకుడు ప్రదర్శిస్తోంది. అక్రమ నిర్మాణాల నియంత్రణలో భాగంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నగరంలోని బ్యాంకులు అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకూడదని కఠిన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో అన్ని బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు ఇప్పటికే ఈ విషయంపై స్పష్టమైన లేఖ రాయగా, తదుపరి చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వేగం
ఇటీవల హైడ్రా, రాష్ట్రవ్యాప్తంగా బఫర్ జోన్ (Buffer Zone), ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనుల్లో జెట్‌స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 300 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, దాదాపు 120 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలలో భాగంగా ఇప్పటికే అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల జాబితాను కూడా హైడ్రా సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల్లో చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారి కోసం రుణాలు ఇచ్చే బ్యాంకులకు కఠిన నిబంధనలు విధించనుంది.
చట్టపరమైన బలగాలు సిద్ధం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ చర్యలకు మరింత బలాన్నివ్వడం కోసం చట్టపరమైన బృందాన్ని (Legal Team) కూడా సిద్ధం చేశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కోసం బ్యాంకులు రుణాలు ఇచ్చే అంశంపై హైడ్రా ముఖ్యంగా ఫోకస్ చేస్తోంది. జూన్ 26 నుండి కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా, ఇప్పటివరకు బ్రేకులు వేయకుండా తన దూకుడును కొనసాగిస్తోంది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని 27 మున్సిపాలిటీలతో పాటు, ఇతర గ్రామాల్లోని ఆక్రమణలపై దాడులు నిర్వహిస్తోంది.
కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో హైడ్రా ఆపరేషన్
ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం గురించి తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే, అమీన్‌పూర్‌లోని కిష్టారెడ్డిపేటలో ఒక ఎకరంపైగా, పటేల్‌గూడలో మూడు ఎకరాలకుపైగా అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. ఈ కూల్చివేతల్లో రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగాలు హైడ్రాతో కలిసి పనిచేశాయి.
బాధితుల అరణ్య రోదన
అక్రమ నిర్మాణాల కూల్చివేత వల్ల కూలిన భవనాల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వంత సామాన్లను సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా హైడ్రా ఈ చర్యలు చేపట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఈ చర్యల వల్ల లక్షల్లో నష్టపోయామని, రోడ్డున పడిపోయామని బాధితులు వాపోతున్నారు.
నాన్‌స్టాప్ కూల్చివేతలు
హైడ్రా ఇటీవల అమీన్‌పూర్‌లో సుమారు 17 గంటలపాటు నాన్‌స్టాప్ కూల్చివేతలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆపరేషన్‌లో ఓ హాస్పిటల్, రెండు అపార్ట్‌మెంట్లను కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అలాగే, పటేల్‌గూడలో 16 విల్లాలను కూల్చివేసింది. ఈ ఆపరేషన్‌లో పక్కన ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని, హైరిస్క్ ఆపరేషన్‌ను పూర్తి చేశారు.