తెలంగాణ: తెలంగాణలో హైడ్రా ఉక్కుపాదం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) ఆక్రమణలను నేలమట్టం చేస్తూ ఉక్కుపాదం మోపుతోంది.
మూడున్నర నెలల క్రితం జూలై 19న జారీ చేసిన జీవో నెంబరు 99 ప్రకారం, ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ప్రారంభమైంది.
జూలై 26న మొదలైన ఈ కూల్చివేతల ప్రక్రియలో ఇప్పటి వరకు 300కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 120 ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది.
వందనపురి కాలనీలో హైడ్రా దాడులు
ఈ రోజు (సోమవారం) అమీన్ పూర్ పరిధిలోని వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం కూల్చివేసింది.
రోడ్డు ఆక్రమించి నిర్మించిన భవనాలను ముందుగా నోటీసులు ఇచ్చినప్పటికీ తొలగించకపోవడంతో, భారీ యంత్రాలతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి వాటిని తొలగించారు.
కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా రెండు చోట్ల అక్రమ నిర్మాణాలు గుర్తించగా, అవి కూడా త్వరలోనే కూల్చివేతకు గురవనున్నాయి.
100 రోజుల్లో 120 ఎకరాలు
హైడ్రా విస్తృత దాడులతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి సహా 27 మున్సిపాలిటీల్లో, 33 గ్రామాల్లో దూకుడు పెంచింది.
హైడ్రా నిర్వర్తించిన ముఖ్యమైన చర్యల్లో, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైడ్రా మొత్తం 100 రోజుల్లో 300 అక్రమ నిర్మాణాలు కూల్చి, అనేక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించింది.
తీవ్ర వ్యతిరేకత
కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర భయం వ్యాపించింది. ఎప్పుడు తమ ఇళ్లను కూల్చివేస్తారోనన్న ఆందోళన నెలకొంది.
హైడ్రా చర్యలపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టు జీవో 99 చట్టబద్ధతపై ప్రశ్నించింది.
స్టే ఇవ్వాలంటూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో, హైడ్రా చర్యలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనికి ఆమోద ముద్ర వేశారు.
పూర్తిస్థాయి అధికారాలు
ఇటీవల, హైడ్రాకు పూర్తి స్థాయిలో అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 199ను విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ చట్టంలో 374B సెక్షన్ చేర్పించి, హైడ్రాకు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించడం, నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడం వంటి పూర్తి అధికారాలు కల్పించింది.