తెలంగాణ: “ఇక భరించలేను” – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, తనను అనేక సంవత్సరాలుగా విపరీతంగా వేధిస్తున్నారని ఆరోపించారు. “2014 నుంచి పార్టీలో ఉన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇక భరించలేకపోతున్నా. పార్టీకి నేను అవసరం లేకపోతే చెప్పండి.. వెంటనే వెళ్లిపోతా” అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు.
గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన రాజాసింగ్… గోల్కొండ బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక తన అసంతృప్తికి ప్రధాన కారణమని తెలిపారు. “ఆ పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టాలని సూచించా. కానీ నా సిఫారసు చేసిన పేర్లను పక్కన పెట్టి, ఎంఐఎంతో తిరిగే వారికే పదవి అప్పగించడం ఏంటని ప్రశ్నించా” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన కీలక నేతల్ని సంప్రదించినా సరైన సమాధానం రాలేదని ఆరోపించారు. “జిల్లా అధ్యక్షుడి ఎన్నిక గురించి కీలక నేతకు ఫోన్ చేశాను. అయితే ఆయనకు ఆ విషయం తెలియదని చెప్పారు. అదే నా మీద జరుగుతున్న కుట్రను బయటపెట్టింది” అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
తాను గతంలో బీజేపీ తరఫున ఎంఐఎం, భారాస, కాంగ్రెస్ పార్టీలతో పోరాటం చేశానని, ఇప్పుడు సొంత పార్టీలోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన వ్యక్తులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తారు. మరి నా సూచన మాత్రం ఎందుకు పక్కన పెట్టబడింది? దీనిపై పార్టీ సమాజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలి” అని డిమాండ్ చేశారు.
రాజాసింగ్ తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ, “నేను ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం మాత్రమే నేర్చుకున్నా. కానీ కొందరు బ్రోకరేజ్ చేస్తూ పార్టీని నాశనం చేస్తున్నారు. అలాంటి వారివల్లే బీజేపీ రాష్ట్రంలో బలపడటం లేదు. వీరు పార్టీ నుంచి తప్పుకుంటూనే బీజేపీకి రాష్ట్రంలో భవిష్యత్ ఉంటుంది” అని స్పష్టంగా చెప్పారు.