ఆంధ్రప్రదేశ్: జన్మలో ఇక రాజకీయాలపై మాట్లాడను: పోసాని సంచలన ప్రకటన
ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి గురువారం సంచలన ప్రకటన చేశారు.
‘‘ఇకనుంచి రాజకీయాలపై ఒక్కమాట కూడా మాట్లాడను’’ అని అన్నారు.
ఇటీవల ఆయనపై వైకాపా నేతగా ఉన్న కాలంలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పరంగా ఏపీ పోలీసులు సీఐడీ ద్వారా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి.
అంతేకాదు, తిరుమల తితిదే చైర్మన్ బీఆర్ నాయుడిపై అవమానకర వ్యాఖ్యలు చేసి, తిరుమల కొండపై దోపిడీకి ప్రయత్నించారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
దీనిపై టీడీపీ నాయకులు ఆయన్ని తీవ్రంగా విమర్శించారు. బాపట్ల, అనంతపురం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పోసానిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
వీటికి సమాధానంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని రాజకీయాలపై తన అభిప్రాయాలను వివరించారు.
‘‘నేను ఒకరిని తిట్టినపుడు, వారి నడవడిక, నిజాయితీ, నీతిని బట్టి మాట్లాడుతాను. ప్రధాని నరేంద్ర మోదీ వంటి నిజాయితీపరుల మీద నేను ఎప్పుడూ విమర్శ చేయలేదు. మోదీగారి జీవితంలో అవినీతి లేదు. అలాంటి వాళ్లను నేను ఎప్పుడూ ప్రశంసిస్తాను కానీ వ్యతిరేకంగా మాట్లాడను. అలాగే, అప్పట్లో ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ వంటి గొప్ప నేతలపైనా విమర్శలు చేయలేదు’’ అని వివరించారు.
1983 నుంచి రాజకీయాలపై మాట్లాడుతున్నానని, ప్రతి పార్టీని వారి మంచిపనులకు ప్రశంసించానని, తప్పులపైన మాత్రం తీవ్రంగా విమర్శించానని చెప్పుకొచ్చారు.
‘‘ఇక జన్మలో రాజకీయాలు ప్రస్తావించను, ఎటువంటి పార్టీకి మద్దతు ఇవ్వను, ప్రశంసించను. నా పైన కేసులు పెట్టినందున ఇలా చెప్తున్నాను అనుకుంటే అది అర్థం కాదు. నా మాటలు అర్థం చేసుకోని వ్యక్తులు, నా కంటే చిన్నవయస్కులు నుంచి వృద్ధుల వరకు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ అధికారంలో ఉన్న నాయకుడిని చులకన చేయలేదు. నారా చంద్రబాబునాయుడిని ఎంతో గౌరవిస్తున్నాను. ఆయన చేసిన మంచి పనులు ప్రశంసించాను, ఆయన చేసిన తప్పులు విమర్శించాను’’ అని తెలిపారు.