న్యూయార్క్: ప్రపంచాన్ని వణికుస్తున్న కోవిడ్ ను ఆరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాల ప్రజలు ఎదురు చుస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్లు ముంపు ఉందని ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం హెచ్చరించింది.
వ్యాక్సిన్ ను రవాణా చేసే సంస్థల డేటాపై అంతర్జాతీయ హ్యాకర్ల బృందం టార్గెట్ చేస్తున్నట్లు ఐబీఎం హెచ్చరించింది. ఈ మేరకు ఐబేఎం నిపుణుల బృందం హ్యాకర్ల కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఐబీఎం అనలిస్ట్ క్లయిర్ జబోయివా మాట్లాడుతూ, అంతర్జాతీయ హ్యాకర్లు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ అంశంపై సమాచారం సేకరించేందుకు విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ సైబర్ సెక్యూరిటీ బృందం గుర్తించిందన్నారు.
పలు హైయర్ రిఫ్రిజరేషన్ యూనిట్ల తయారి, మోడల్‌తో పాటు ధరలపై హ్యాకర్లు పరిశోధన చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ డేటాను సేకరించేందుకే హ్యాకర్లు ఈమెయిళ్ల రూపంలో వలలు విసురుతున్నారని, పక్కా ప్రణాళికతో డేటాను దొంగలించేందుకు హ్యాకర్లు అసాధారణ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అయితే ఈమెయిళ్లను చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ అనే కోల్డ్ చైన్ సేవల సంస్థ ప్రతినిధి పేరుతో పంపుతున్నట్లు గుర్తించామన్నారు.
అందువల్ల వ్యాక్సిన్ పంపిణీ చేసే ఆయా సంస్థలు చాలా అప్రమత్తంగా ఉండాలని లేదంటే కరోనా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ ప్రక్రియకు భంగం కలుగుతుందని జబోయివా హెచ్చిరించారు. కాగా కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందించే క్రమంలో కోల్డ్ చైన్ విధానం పాటించాలని ఐపీఎం తెలిపారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి కేంద్రాల నుంచే అత్యంత శీతలీకరణ ఏర్పాట్లతో రవాణా చేయాలని, ప్రజల వద్దకు వ్యాక్సిన్ డోసులు వెళ్లేవరకు అవి చల్లని వాతావరణంలోనే ఉండాలని వివరించారు.
ఒకవేళ రవాణాలో శీతలకరణకు ఆటంకం ఏర్పడితే వ్యాక్సిన్ పాడైపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కరోనా వ్యాక్సిన్‌లను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాలని, ప్రస్తుతం ఫైజర్, బయో ఎన్ టెక్ ఎస్ఈ వంటి ఫార్మా కంపెనీలు కోల్డ్ చైన్ విధానంపై ఎలాంటి భద్రతలు పాటిస్తున్నారనే అంశాన్ని గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.