ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఈ టోర్నీలో టీమిండియా పోటీ పటిష్టంగా ఉంది. అభిమానుల భారీ డిమాండ్ నేపథ్యంలో, ఐసీసీ భారత జట్టు మ్యాచ్‌లకు అదనపు టికెట్లను విడుదల చేసింది.
టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అన్ని మ్యాచ్‌లకు టికెట్ల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ఐసీసీ తాజా నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడనుంది. ఫైనల్ చేరినట్లయితే, అది దుబాయ్‌లోనే జరగనుంది. సెమీఫైనల్ వరకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయని, ఫైనల్ మ్యాచ్ టికెట్ల గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఐసీసీ తెలిపింది.
సెమీఫైనల్‌లో టీమిండియా ఓడిపోతే, ఫైనల్ పాకిస్థాన్‌లో జరగనుంది. కానీ, భారత్ గెలిస్తే, ఫైనల్‌కి దుబాయ్ వేదిక అవుతుంది. ఈ కారణంగా ఐసీసీ ఫైనల్ టికెట్ల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.