చెన్నై: ఐసీసీ పై టీమిండియా కెప్టెన్ కోహ్లి నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ 227 పరుగులు ఘోర పరాజయం తర్వాత టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్ పట్టికలో ఒక్క సారిగా నాలుగో స్థానానికి పడిపోగా, ఇంగ్లండ్ టాప్ స్పాట్ కు చేరింది.
ఈ నేపథ్యంలో విరాట్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించి పర్సంటైల్ రూల్స్ ఎలా మారుస్తారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగకపోవడంతో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో ఐసీసీ ఒక కమిటీని నిర్వహించింది. పీసీటీ(పర్సటైంజ్ ఆఫ్ పాయింట్స్) ఆధారంగా జట్ల స్థానాలు మారే అవకాశం ఉంటాయని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం పై విరాట్ కోహ్లి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, అలాంటప్పుడు రూల్స్‌ను కూడా మారాలి. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మ్యాచ్‌లో ఓటమి, గెలపు సహజమే అయినా మేం పాయింట్ల గురించి అంతగా బాధపడడం లేదు. అయితే కొన్ని విషయాల్లో మీరు లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కోపం తెప్పించింది, అంటూ పేర్కొన్నాడు.
తొలి టెస్టు ఫలితం అనంతరం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి (68.25 పాయింట్ల శాతం) పడిపోగా, ఇంగ్లండ్ (70.16 పాయింట్ల శాతం) అగ్రస్థానానికి చేరుకుంది. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలకు తాజా పరాజయంతో కొంత దెబ్బ పడింది.
కానీ ఇంకా పరిస్థితి పూర్తిగా చేయి దాటలేదు. భారత్ ఫైనల్ చేరాలంటే భారత్‌కు మరో 70 పాయింట్లు కావాలి. అంటే కనీసం 2 మ్యాచ్‌లలో విజయంతో పాటు మరో మ్యాచ్ డ్రా చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే తర్వాతి రెండు టెస్టులో ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా ఆట ముగిసినట్లే. కాగా జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.