దుబాయ్: భారత్ లో జరిగిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిందియా తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇది వరకే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్(3-1), టీ20 సిరీస్ (3-2) లను సైతం కైవసం చేసుకున్న టీమిండియా టెస్టుల్లో మొదటి స్థానంలో, టీ20ల్లో రెండవ స్థానంలో ఉంది.
ఇంగ్లండ్ టీమిండియా చేతిలో వన్డే సిరీస్ 1-2 తో కోల్పోయినప్పటికీ, 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి జట్టు, న్యూజిలాండ్(118)ను మూడో స్థానానికి తోసి 119 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్న న్యూజిలాండ్ 118 పాయింట్లకు మాత్రమే పరిమితమై మూడో స్థానంలో నిలబడింది.
ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్ జాబితాలో 111 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగవ స్థానంలో, 108 పాయింట్లతో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని సాధించి ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.
ఈ మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి భారత శిబిరంలో గుబులు పుట్టించిన ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం చేసుకోగా, వరుస అర్ధసెంచరీలతో అలరించిన ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దూల్ కి రానందుకు కోహ్లీ ఆశ్చర్యానికి గురైనట్లు ఇంటర్వ్యూ లో తెలిపారు.