ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ప్రధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో మోసాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తూ, ఎఫ్‌డీలు మళ్లించడంపై అధికారులు ఆరా తీశారు. బాధితులు రెండు నెలలుగా తమ ఖాతాలకు వడ్డీ జమ కాలేదని ఆందోళన చెందారు. బ్యాంకు అధికారులు ఎఫ్‌డీ బాండ్లు చెల్లవని చెప్పిన తర్వాత వారు షాక్‌కి గురయ్యారు.
ఈ క్రమంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసును సీఐడీకి అప్పగించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బాధితులకు అండగా నిలిచి, బ్యాంకు అధికారులను న్యాయం చేయమని కోరారు. రాష్ట్రంలో ఐసీఐసీఐ బ్యాంకుల్లో అవకతవకల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.
ఐసీఐసీఐ మాజీ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం
ఐసీఐసీఐ బ్యాంకు అక్రమాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో, బ్యాంకు మాజీ మేనేజర్ నరేష్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. తనను మోసం చేశారని, ఉన్మాదంతో ఉన్నతాధికారులు, బ్యాంకు సిబ్బంది తనను తప్పుపడుతున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారులను మోసం చేయలేదని, కొన్ని లావాదేవీల్లో చిన్న పొరపాట్లు జరిగాయని వివరించారు.
బంగారం రుణాల విషయంలో కొంతమంది పేర్లు మార్చిన విషయాన్ని అంగీకరించిన నరేష్, మోసం చేయాలన్న ఉద్దేశం లేదని చెప్పారు. జడ్.ఎం. సందీప్ మెహ్రా వల్ల తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పటికీ, కుటుంబం కోసం ఆ ఆలోచనను విరమించుకున్నట్లు వివరించారు.
పలువురి పేర్లు బయటపెట్టిన నరేష్
నరేష్ తన వీడియోలో పలువురి పేర్లను వెల్లడించారు. విజయవాడ భారతీనగర్ బ్రాంచిలో ఆర్.ఎస్.చంద్రశేఖర్, ఏలూరు రోడ్డు ప్రవీణ్ డబ్బులు తీసుకున్నారని, వంశీ నరసరావుపేటలోని తన ఇంట్లో ఉంటున్నారని తెలిపారు. జంగారెడ్డిలో కంచర్ల విష్ణుప్రసాద్, పులిపాక ఉమా మహేశ్వరరావు రూ.5 నుంచి 6 కోట్లు ఇవ్వాలని చెప్పారు.
ఈ వీడియోతో బ్యాంకు అవకతవకలు మరింత బాహాటంగా మారాయి, సీఐడీ విచారణ కీలక దశకు చేరుకుంది.