న్యూఢిల్లీ : రానున్న వరస పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. గృహ, వాహన, వ్యక్తిగత, వినిమయ రుణాలపై ఐసీఐసీఐ పండగ బొనాంజాను ప్రకటించింది. గృహ రుణాలు, ఇతర బ్యాంకుల నుంచి రుణాల బదిలీపై కనిష్టంగా 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేయనుంది.
ఈ సీజన్ లో ప్రాసెసింగ్ ఫీజును అతితక్కువగా రూ 3000 నుంచి వసూలు చేయనుంది. ఈ పండగ సీజన్‌లో సొంత కారును కొనుగోలు చేయాలనుకునే వారికి వెసులుబాటుతో కూడిన ఈఎంఐలను ప్రకటించింది. 84 నెలల కాలవ్యవధిలో లక్ష రూపాయలకు కేవలం 1554 రూపాయల నుంచి ఈఎంఐలను ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు మహిళా కస్టమర్లకు కనిష్టంగా 1999 రూపాయలుగా ప్రాసెసింగ్ ఫీజును నిర్ణయించింది.
కాగా ద్విచక్ర వాహనాలు కొనాలనుకునే వారికి 36 నెలల వ్యవధికి వేయి రూపాయలకు ఈఎంఐ అతితక్కువగా 36 రూపాయలు చార్జ్ చేయనుంది. వారికి కూడా ప్రత్యేకంగా ప్రాసెసింగ్ ఫీజును కేవలం 999 రూపాయలుగా నిర్ణయించింది. వ్యక్తిగత రుణాలను కనిష్టంగా 10.50 శాతం వడ్డీరేటుపై ఆఫర్ చేయడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కేవలం 3999 రూపాయలుగా నిర్ణయించింది.
ఇంకా ఫెస్టివ్ బొనాంజా పేరుతో పలు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లనూ బ్యాంక్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై వినిమయ రుణాలపై నో కాస్ట్ ఈఎంఐని ఆఫర్ చేస్తోంది. ఫెస్టివ్ బొనాంజా కింద ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్, వాణిజ్య కస్టమర్లకూ పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.