ఆంధ్రప్రదేశ్: రైతు బాగుంటే దేశం బాగుంటుంది – పవన్ కల్యాణ్
ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
గోకులాల ప్రాధాన్యత:
‘‘గోకులాల ద్వారా చిన్న రైతులు, కౌలు రైతులు, ఇతర వర్గాల పరిస్థితి మెరుగుపడుతుంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో కేవలం 268 గోకులం షెడ్లను నిర్మించగా, మా ప్రభుత్వం ఆరు నెలల్లో 12,500 షెడ్లను నిర్మించింది. భవిష్యత్తులో 20,000 గోకులాలు ఏర్పాటు చేస్తాం’’ అని పవన్ అన్నారు. పాడి పరిశ్రమను పునరుద్ధరించడమే లక్ష్యమని, పల్లె పండుగ, గోకులం షెడ్ల ద్వారా గ్రామీణ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
తిరుపతి ఘటనపై క్షమాపణలు:
తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్, ‘‘ఎక్కడ తప్పు జరిగినా స్పందించాల్సిన గుణం ఉండాలి. మేము చేసిన తప్పులకుగానూ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరా. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్, సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యతను వారు నిజాయితీగా నిర్వర్తించాలి’’ అని అన్నారు.
అభిమానులకు పవన్ సందేశం:
‘‘ప్రమాద సమయంలో కేరింతలు, అరుపులు అనవసరం. పోలీసులకు సహకరించాలి. ఏ వ్యక్తి అయినా తమ బాధ్యతలను సరైన రీతిలో నిర్వర్తించాలి. నా పట్ల ప్రజలు నమ్మకంతో ఓటు వేశారు. వారి ఆశలను నెరవేర్చడమే నా లక్ష్యం. ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాను’’ అని పవన్ వెల్లడించారు.
విప్లవకారుడి మనసు, నాయకుడి బాధ్యత:
‘‘నాకు డబ్బు లేదా పేరు మీద ఆసక్తి లేదు. బాధ్యత మాత్రమే ఉంది. నా దృష్టి ప్రజల అభివృద్ధిపైనే ఉంటుంది. మీరు నమ్మి గెలిపించినందుకు బాధ్యతగా నిలుస్తాను. 15 ఏళ్ల కూటమి పాలనకు మద్దతుగా ప్రజలు నిలవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.