న్యూఢిల్లీ: యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఇ) ప్రపంచవ్యాప్తంగా జరిగిన కరోనా వైరస్ మరణాల లెక్కలపై చేసిన అధ్యయనానికి సంబంధించి షాకింగ్ అంచనాలను ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు మరణాలకు సంబందించి నిజమైన మరణాల కంటే తక్కువ మరణాలను చూపించాయని అని తమ తాజా అధ్యయనంలో తేలింది. అన్నింటికంటే ముఖ్యంగా భారత్ లో దాదాపు 4.3 లక్షల మేర కరోనా మరణాలను తక్కువ చూపినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా మొత్తం మరణాల అంచనా అనే శీర్షికతో ఐహెచ్‌ఎంఈ ఈ డేటాను విశ్లేషించి ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్యల కంటే అధిక మరణాలు జరిగాయని తమ అధ్యయనం అంచనా వేసింది. అమెరికాలో కూడా మరణాల సంఖ్యను 3.4 లక్షలు తక్కువే చూపాయని అధ్యయనం చెబుతోంది.
ఇంకా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మాదిరిగానే భారత్ కూడా కోవిడ్ ద్వార జరిగిన మరణాలను తక్కువ చేసి చూపించిందని ఐహెచ్‌ఎంఈ తేల్చింది. భారతదేశం 4.3 లక్షల మరణాల లెక్క తక్కువగా చూపించండమో లేదా అసలు వాటిని లెక్కించకపోవడమో జరిగింది. అలాగే రష్యా కూడా దాదాపుగా 5.93 లక్షలు తగ్గించిందని వారి అధ్యయనం కనుగొంది. మార్చి 2020- మే, 2021 వరకు సంభవించిన కోవిడ్ మరణాలపై 20 దేశాల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది.
మరణాల నమోదు విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించడం లేదని తెలిపింది. ముఖ్యంగా ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తి మరణిస్తే, కోవిడ్ మరణం కింద లెక్కించాల్సి ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కోడ్ ప్రకారం మరణించే సమయానికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుని తరువాత మరణిస్తే, కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ కూడా దాన్ని కరోనా మరణంగానే నమోదు చేయాలి.