భోపాల్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) పెంచుకునే పనిలో పద్దారు. ఈ క్రమంలో మార్కెట్‌లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్‌లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం వెరైటీగా రోగనిరోధకత పెంచే చీరలు వచ్చాయి. అవును మీరు చదివింది నిజమే.
ఆడ వారికి రోగనిరోధక శక్తిని పెంచే చీరలను ‘ఆయుర్‌వస్త్రా’ పేరుతో మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ చీరను రకరకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేశామని, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని అధికారులు తెలుపుతున్నారు. చీరలు మాత్రమే కాక ఇతర దుస్తులను కూడా తయారు చేశామన్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని. ఫలితంగా కరోనా వైరస్ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్ అధికారులు.
రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్‌కి అప్పగించింది. ఈ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక ఎంతో నైపుణ్యం అవసరమన్నారు మాలేవర్.
లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారికి వాడినట్లు వెల్లడించారు. వీటన్నింటిని పొడి చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తరువాత దీన్ని మరగబెట్టి, దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఇది కొన్ని గంటలపాటు జరుగుతుంది. తర్వాత ఆవిరి పట్టించిన వస్త్రంతో చీర, మాస్క్, ఇతర దుస్తులు తయారు చేస్తారు.
ఈ పద్దతిలో ఒక చీర తయారు చేయడానికి 5-6రోజులు పడుతుందని తెలిపారు. కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో మేం జనాలకు మేలు చేసే హెర్బల్ దుస్తులను మార్కెట్‌లోకి తెచ్చాం. ప్రస్తుతం రోగనిరోధకత పెంచే ఈ చీర ధర 3 వేల రూపాయలు’ అన్నారు.