తిరుమలలో గోవిందుడొక్కడే వీఐపీ అంటున్న సీఎం చంద్రబాబు!
తిరుమల: తిరుమలలో వీఐపీ సంస్కృతిని తగ్గించాలని, గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేస్తూ, తిరుమల పవిత్రత, నమ్మకాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.
వీఐపీ సంస్కృతిపై..
తిరుమలలో వీఐపీ సంస్కృతిని తగ్గించాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రముఖులు వచ్చినప్పుడు ఆర్భాటం తగ్గించి, ఆధ్యాత్మిక అనుభవం ప్రధానంగా ఉండేలా చూడాలని సూచించారు. హడావుడి లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలని, అనవసర వ్యయాలు తగ్గించాలని సీఎం చెప్పారు.
గోవింద నామమే మార్మోగాలి
గోవింద నామస్మరణ తప్ప మరో మాట తిరుమల కొండపై వినిపించకూడదని చంద్రబాబు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్యకర్త, భక్తుడు తిరుమల పవిత్రతను కాపాడేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
భవిష్యత్ ప్రణాళికలు
తిరుమలలోని నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు తెలిపారు. అటవీ విస్తరణ కోసం కూడా 5 ఏళ్ల ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
సేవలపై ఫీడ్‌బ్యాక్
టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయాలను సేకరించి, సేవల మెరుగుదల కోసం చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం వంటి వాటిలో నాణ్యత ఎల్లప్పుడూ ఉండాలని, అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని తెలిపారు.
స్విమ్స్ సేవలు
స్విమ్స్ ఆసుపత్రి సేవలను మెరుగుపరచాలని, తిరుమల పవిత్రతను కాపాడే దిశగా ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని సీఎం సూచించారు.
ఈ సమీక్ష అనంతరం తిరుమలలో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ కూడా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.