తమిళనాడు: తమిళనాడులో సినీరంగంలో ‘దళపతి’గా పేరు పొందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారని తెలిసిందే.
ఈ ఏడాది ప్రారంభంలో ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తాజాగా, ఈ పార్టీకి సంబంధించిన జెండాను చెన్నైలో గురువారం ఆవిష్కరించారు.
విజయ్ తన పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగులతో ఉన్న ఈ జెండాలో మధ్యలో వాగాయి పువ్వుతో పాటు రెండు ఏనుగులు అటు ఇటుగా నిలిచాయి. తమిళ సంప్రదాయంలో ఈ వాగాయి పువ్వు విజయానికి ప్రతీకగా భావించబడుతుంది.
జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ వేడుకలో విజయ్ తల్లిదండ్రులు, మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విజయ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
“మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను, తమిళ నేల నుంచి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేము తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం” అని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
విజయ్ రాజకీయ రంగంలో అడుగుపెట్టడం, పార్టీ జెండా ఆవిష్కరించడంతో, 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాత్రపై ఆసక్తి నెలకొంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన విజయ్ 2026 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే, విజయ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటారా అనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.