ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్ ప్రకారం, రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు వర్తించనుంది. పన్ను చెల్లింపుదారులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
నూతన పన్ను విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. స్టాండర్డ్ డిడక్షన్‌ను కలిపి చూస్తే, రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశముంది.
ఇక టీడీఎస్ పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచడం ద్వారా వడ్డీ ఆదాయంపై పన్ను భారాన్ని తగ్గించనుంది.
ఇక వృద్ధులకు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై కూడా భారీ ఉపశమనం కల్పించారు. ప్రస్తుతం ఉన్న రూ. 2.4 లక్షల పరిమితిని రూ. 6 లక్షలకు పెంచుతూ కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పన్ను శ్లాబుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని స్పష్టం చేసింది. రూ. 4-8 లక్షల ఆదాయానికి 5%, రూ. 8-12 లక్షల ఆదాయానికి 10% పన్ను విధించనుంది. 12 లక్షల పైబడితే పెరిగిన శ్లాబ్‌ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయాలతో వేతన జీవులకు మరింత ప్రయోజనం కలుగనుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరట కలిగించే బడ్జెట్‌గా మారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.