అమరావతి: ఏపీలో సైబర్ క్రైమ్ పెరుగుదలపై డీజీపీ స్పందన తెలియజేసారు.
సైబర్ నేరాలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సందర్భంగా, రాష్ట్రంలో నేరాల పరిస్థితిపై వివరణ ఇచ్చారు.
క్రైమ్ రేటు తగ్గినప్పటికీ సైబర్ నేరాల పెరుగుదల
డీజీపీ మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం క్రైమ్ రేటు 5.2 శాతం తగ్గిందని చెప్పారు. అయితే సైబర్ క్రైమ్ రేటు మాత్రం కొంత మేర పెరిగిందని, దీనిపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాపర్టీ అఫెన్సెస్‌లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, పోలీసులు తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు కొంత మేర తగ్గాయని వివరించారు.
సైబర్ నేరాలకు కట్టడి
ప్రజలు డిజిటల్ అరెస్ట్ కాల్స్ వంటి మోసాలకు చిక్కకుండా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని డీజీపీ తెలిపారు. ఈ అంశంపై సైబర్ క్రైమ్ స్టేషన్ల సంఖ్యను పెంచుతూ, రాష్ట్రవ్యాప్తంగా మూడు సైబర్ క్రైమ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
గంజాయి నిర్మూలనపై ప్రత్యేక చర్యలు
రాష్ట్రం గంజాయి రహిత ఏపీగా మారడమే లక్ష్యమని డీజీపీ స్పష్టం చేశారు. 10,837 ఎకరాల్లో గంజాయికి ప్రత్యామ్నాయ పంటలు వేసినట్లు తెలిపారు. గంజాయి నిర్మూలనలో డ్రోన్స్ టెక్నాలజీ ఉపయోగించటం ద్వారా మంచి ఫలితాలు సాధించామన్నారు. 10 పోలీస్ స్టేషన్లకు ఒక డ్రోన్ కేటాయిస్తూ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు.
టెక్నాలజీతో నేరస్థుల పట్టివేత
నేరస్థులపై కఠినంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని చెప్పారు. దేవాలయాల భద్రతలో తీసుకున్న చర్యల వల్ల ఇప్పటి వరకు 37 దొంగతనాలు ఛేదించామని తెలిపారు.
సోషల్ మీడియా పర్యవేక్షణ
సోషల్ మీడియా దుర్వినియోగంపై మొత్తం 576 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. రానున్న మూడు నెలల్లో లక్ష సీసీ కెమెరాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.