దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయంతో బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. శుభ్‌మన్ గిల్ (101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (41 నాటౌట్), రోహిత్ శర్మ (41) ఫర్వాలేదనిపించారు.
బంగ్లా నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆరంభంలో రోహిత్-గిల్ జోడీ 69 పరుగుల భాగస్వామ్యం అందించింది.
రోహిత్ ఔట్ కావడంతో కోహ్లీ (22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ (8) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.
గిల్ తన సెంచరీ పూర్తి చేసుకుని రాహుల్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ రెండు, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు.
బంగ్లా ఇన్నింగ్స్ లో తౌహిద్ హృదయ్ (100), జాకర్ అలీ (68) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు, హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.