అమరావతి: సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు ఉగ్రవాదకంటే ప్రమాదకరం : హోం మంత్రి అనిత
సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని, తగిన శిక్షలు విధించాలని ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోందని చెప్పారు. మహిళలపై అనుచితంగా మాట్లాడినవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ పాలనలో సామాజిక మాధ్యమాలను రాజకీయం చేయడంలో దారుణమైన ఘటనలు చోటు చేసుకున్నాయని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. జగన్ సొంత కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు వచ్చినా ఆయన స్పందించలేదని, రవీంద్ర రెడ్డి వంటి వారిని వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్సీపీ కార్యకలాపాలు దుర్మార్గం
జగన్ హయాంలో రౌడీలకు రాజకీయ కవచం కట్టారని, ప్రతీ 8 గంటలకు మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయని అనిత ఆరోపించారు. చంద్రబాబు సతీమణి, పవన్ కళ్యాణ్ కుమార్తెలపై కూడా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే, ఎక్కడ దాక్కున్నా వారిని పట్టుకుంటామని ఆమె హెచ్చరించారు.
పోలీసులను కాపలా కోసం వాడుకున్నారు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులను తమ ఇళ్లకు కాపలా పెట్టడానికి, ప్రజలపై భయభ్రాంతులకు ఉపయోగించారని మంత్రి అనిత ఆరోపించారు. తనపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై తాను గుండే ధైర్యంతో భరిస్తున్నా ఇతరులైతే ఆత్మహత్య చేసుకునేవారన్నారు. అలాంటి దుర్మార్గుల్ని చూస్తూ వదిలేయాలా ప్రశ్నించారు. జగన్ తన చెల్లి షర్మిలపై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి షకీలా అనే పోస్టు పెట్టినా చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ వ్యవస్థపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఎంత మందిని అరెస్టు చేశారో జగన్కు గుర్తుందా అని నిలదీశారు.
ఎన్డీఏ కూటమిలో శాంతియుత వాతావరణం
ఏకతాటిపై ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మహిళల రక్షణకు చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని, మహిళలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారి భరతం పడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కక్షలు, అసభ్యకర పోస్టులకు తాము భయపడమని, ఈ విషయంలో ఎక్కడ దాక్కున్నా వదలమని స్పష్టం చేశారు.
బాధ్యతలేని వారు ఇంట్లో కూర్చొంటారు
ఎమ్మెల్యేలే ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమస్యలపై మాట్లాడే బాధ్యత ఉండాలన్నారు, కేవలం ఇంట్లో కూర్చునే వారికి అసెంబ్లీలో స్థానం ఉండదని తెలిపారు.