6G టెక్నాలజీపై: దేశంలో టెలికమ్యూనికేషన్ సేవలు ఎంత వేగంగా పెరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఐదేళ్లలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్పుడు 5G విస్తరణ దేశమంతా వ్యాప్తి చెందకముందే భారత ప్రభుత్వం 6G టెక్నాలజీకి దారులు వేస్తోంది. భారతీయ వినియోగదారులు అంచనాలకు మించిన వేగంతో 6జీ సేవలను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన 8వ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలకమైన 6జీ ప్రణాళికలను వెల్లడించారు. ఈ సమావేశంలో భాగంగా, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) నిర్వహించిన ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ’ సెషన్‌లో సింధియా ఒక వివరణ ఇచ్చారు.
6జీ టెక్నాలజీ ప్రపంచంలో తొలి సారిగా భారతదేశంలో ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. భారత్ 6జీని అందుబాటులోకి తీసుకురావడంలో గ్లోబల్ టెక్నాలజీ పోటీలో ముందుండాలని ప్రధాని మోదీ విజన్ అని అన్నారు. 4జీ, 5జీ సేవల్లో ముందున్న భారత్, 6జీ విషయంలోనూ అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక 6జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేలా అవసరమైన ధరల్లో ఉండాలని, ఈ టెక్నాలజీ సాధారణ వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నది తమ ధ్యేయమని తెలిపారు. 6జీ సాంకేతికతను అందుబాటులో ఉంచేటప్పుడు ధరల ప్రాముఖ్యతను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు 6G కారణంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, వీ (వోడాఫోన్-ఐడియా) వంటి ప్రధాన టెలికాం కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది.