న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం డిజిటల్ సెక్యూరిటీ విషయంలో మరో అడుగు వేసింది. చైనా కు సంబందించిన మరో రెండు యాప్స్ ను నిషేధించింది. ట్విట్టర్, గూగుల్ సెర్చింజన్‌కు ప్రత్యామ్నాయాలుగా వాడుకలో ఉన్న చైనాకు చెందిన యాప్స్ వీబో, బైడు సెర్చింజన్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుంచి తొలగించినట్టు తాజాగా వెలువడిన నివేదికలు ద్వారా తెలుస్తోంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ రెండు యాప్‌లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 27 న భారత ప్రభుత్వం నిషేధించిన 47 కొత్త యాప్‌లలో వీబో, బైడు సెర్చింజన్ కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటితో పాటు చైనాకు చెందిన మరిన్ని యాప్‌లను నిషేధించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.
భారతదేశం, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వైబో నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 59 యాప్‌లను జూన్ 29 న భారత ప్రభుత్వం నిషేధించింది.
వినియోగదారులకు చెందిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించడం ద్వారా భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయన్న కారణంగా ఆ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. పబ్జీ యాప్‌ను కూడా తొలగించడానికి మోదీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీకి చెందిన మరో 275 యాప్‌లను కూడా కేంద్రం పరిశిలనలో ఉన్నట్లు వినికిడి.