మాస్కో: భారత్– చైనా సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సమిసిపోయేలా రెండు దేశాల మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా భారత్ చైనా దేశాల విదేశాంగ మంత్రులు జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్- చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ గురువారం సుమారుగా రెండున్నర గంటలపాటు సరిహద్దుల్లో తలెత్తిన విభేదాల గురించి చర్చించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా, చైనా సైనికులు పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరు, భారీగా సైనిక బలగాలు, యుద్ధట్యాంకుల మోహరిస్తున్న చైనా వైఖరిపై జైశంకర్, వాంగ్ యీ వద్ద అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సరిహద్దు వ్యవహారాలపై 1993, 1996లో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చైనా మంత్రికి భారత్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా సరిహద్దుల్లో శాంతి స్థాపన, సుస్థిరతకై సరైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని జైశంకర్ సూచించినట్లు పేర్కొన్నాయి.