కీలక గస్తీ ఒప్పందం అనంతరం ఇప్పుడు భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ కానున్నట్టు సమాచారం అందుతోంది.
అంతర్జాతీయం: భారత్-చైనా సరిహద్దు వెంబడి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ, రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, డోంగ్ జున్ మధ్య త్వరలో భేటీ జరగనుంది. ఈ భేటీ, ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశాల అనంతరం జరుగనుందని జాతీయ మీడియా వెల్లడించింది.
వాస్తవాధీన రేఖపై గత నాలుగేళ్లుగా నెలకొన్న ఘర్షణలకు తెరదించేందుకు ఇరు దేశాలు 2020 నాటి యథాస్థితిని పునరుద్ధరించే దిశగా గస్తీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా, ఇరు దేశాల సైనికులు 2020లో వాడిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లేందుకు వీలుకల్పించారు. ఈ ఒప్పందంలో భాగంగా కీలక ప్రాంతాల నుంచి సైనిక బలగాలు వెనక్కు తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. అయితే చైనా తన సైనికుల మరణాల సంఖ్యను తొలుత వెల్లడించనప్పటికీ తర్వాత ఐదుగురిగా పేర్కొంది. ఈ ఘర్షణల అనంతరం ఎల్‌ఏసీ వెంబడి ఇరుదేశాలు భారీగా బలగాలను మోహరించాయి.
ఇప్పుడు, తాజా గస్తీ ఒప్పందంతో ఈ ఉద్రిక్తతలకు కొంత మేర ముగింపు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రుల భేటీ కీలకంగా మారింది. సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు జరగనున్నాయి, ఇది ఇరు దేశాల శాంతి బంధాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంది.