ఢిల్లీ: భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి జైశంకర్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. 2020లో తూర్పు లఢఖ్‌లో చైనా దుందుడుకు చర్యల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
అప్పుడు మన సైన్యం ప్రతిఘటించి, చైనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిందని వివరించారు.
నిరంతర దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇటీవల ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొంత మెరుగుదల కనిపిస్తున్నదని జైశంకర్ తెలిపారు.
2020లో ఏప్రిల్-మేలో చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించడం ఘర్షణలకు దారితీసిందని గుర్తుచేశారు.
ఈ పరిస్థితుల్లో భారత సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించినట్లు వివరించారు.
సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం లేకుండా భారత్-చైనా సంబంధాలు సాధారణ స్థాయికి రావడం కష్టమని భారత ప్రభుత్వం చైనాకు స్పష్టంగా తెలియజేసిందని జైశంకర్ పేర్కొన్నారు.
న్యాయమైన, సహేతుక పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు మన వైఖరి అటుతగినదేనని తెలిపారు.