న్యూఢిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కాగా గత 24 గంటల్లో నమోదైన కేసులు సంఖ్య కాస్తంత తగ్గింది. అలాగే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి.
నిన్నటి కేసులతో కలిపి మొత్తం దేశంలో కరోనా సంక్రమించిన వారి సంఖ్య మొత్తంగా 2,02,82,833కు చేరుకుంది. ఇక ఈ గణాంకాలతో యావత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కేసులున్న రెండో దేశంగా భారత్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా భారత్‌లో మాత్రం వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. 137 రోజులలోనే కరోనా కేసులు ఒక కోటి నుంచి రెండు కోట్లకు ఎగిసాయి.
ఈ లెక్క ప్రకారం కేవలం నాలుగు నెలల్లోనే దేశంలోని కరోనా కేసులు రెండింతలు అయ్యాయి. దీనికి ముందు వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష నుంచి ఒక కోటికి చేరుకోవడానికి 360 రోజులు పట్టింది. అదే సమయంలో 3,449 మంది మరణించారు. వరుసగా ఏడు రోజులుగా 3 వేల మంది రోగులకు పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.
గత వారం రోజులలో మరణాల సంఖ్య 41% పెరిగింది. ఈ సమయంలో 24,514 మంది రోగులు మరణించారు. ప్రపంచంలోని టాప్–10 దేశాలతో పోలిస్తే, భారత్‌తోపాటు టర్కీ, అర్జెంటీనా, జర్మనీ, కొలంబియా తదితర దేశాల్లో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇరాన్ వంటి మిగతా దేశాల్లో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.
అయితే గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న రోగుల సంఖ్య 3 లక్షల 20 వేల 289 గా ఉంది. ఇది దేశంలో మారుతున్న పరిస్థితులకు అద్దంపడుతోంది. దీంతో దేశంలో ఇప్పటివరకు 1 కోటి 66 లక్షల 13 వేల 292 మంది కోలుకున్నారు.