న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసుల్లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్క రోజుకి 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం మాత్రం కాస్త సానుకూల పరిణామం.
ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరుకుంది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1290 మంది తమ ప్రాణాలను విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు చేరింది.
కరోనా వైరస్ బాధితుల్లో సోమవారం ఒక్కరోజే 82,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 39,42,360. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,95,933. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని తెలిపింది.
మరణాల రేటు 1.63 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల రేటు 19.84 శాతంగా ఉందని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 5,94,29,115 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొంది.