సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న టి20 3 మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ నేడు జరిగే తుది సమరానికి సిద్ధమైంది. గత మ్యాచ్ జరిగిన వేదికలోనే నేడు మూడో టి20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్ తరహాలోనే చివరి మ్యాచ్ గెలిచి ఆసీస్ లెక్క సరి చేస్తుందా, లేక భారత్ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఆసక్తికరం.
టీమిండియాలో ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో దిగే అవకాశం కనిపిస్తుండగా, ఆస్ట్రేలియా కూడా టెస్టు స్పెషలిస్ట్‌లను దూరంగా ఉంచాలనే నిర్ణయించినట్లు తెలుస్తోంది. షమీ, బుమ్రాలవంటి సీనియర్లు లేకుండానే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత్ మరోసారి తన యువ బౌలర్ల పైనే నమ్మకం ఉంచనుంది.
భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో కూడా కేవలం 20 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన నటరాజన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్‌లో తన యార్కర్లతోనే గుర్తింపు తెచ్చుకున్నా, అంతకుమించి వైవిధ్యభరిత ప్రతిభ అతనిలో ఉందని తాజా ప్రదర్శన నిరూపించింది. మరో మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆడిన తొలి సిరీస్‌లోనే నటరాజన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడం ఖాయం.
భారత్ తో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా పటిష్టంగానే కనిపిస్తోంది. అయినా సరే తొలి మ్యాచ్‌లో లక్ష్యం ఛేదించలేక, రెండో మ్యాచ్‌లో దానిని కాపాడుకోలేక ఆసీస్ జట్టు చతికిలపడింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు.