న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం 2022-23లో భారతదేశ జీడీపీ అంచనాలపై తమ అంచనాలను విడుదల చేసింది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా వార్, సరఫరా గొలుసు అంతరాయాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత రీత్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022-మార్చి 2023 వరకు) భారత ఆర్థికవృద్ధి అంచనాను 7.5 శాతంగా తేల్చింది.
గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ తాజా సంచికలో ప్రపంచబ్యాంకు తమ ఈ అంచనాలను జూన్ 7వ తేదీన వెల్లడించింది. అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరం 2023-24లో వృద్ధి మరింత క్షీణించి 7.1 శాతానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. కాగా ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను సవరించడం ఇప్పటికే ఇది రెండోసారి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించగా, తాజాగా ఇపుడు దాన్ని 7.5 శాతానికి అంచనా వేసింది. ఇది మునుపటి (2021-22) ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉంచింది.
కాగా ఇతర గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఇటీవలి కాలంలో తగ్గించిన సంగతి తెలిసిందే. గత నెలలో, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అధిక ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ 2022 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ ప్రొజెక్షన్‌ను 9.1 శాతం నుండి 8.8 శాతానికి తగ్గించింది.