సిరియాలో నెలకొన్న రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం సిరియాలో ఉన్న భారతీయ పౌరులకు ఆ దేశాన్ని తక్షణమే విడిచి రావాలని హెచ్చరిక జారీ చేసింది.
కేంద్ర విదేశాంగ శాఖ ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిరియాలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నందున అక్కడ ఉన్న పౌరులు కమర్షియల్ విమానాల ద్వారా దేశానికి తిరిగి రావాలని సూచించింది.
డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయం అందుబాటులో ఉండి, అవసరమైన అన్ని సహాయ చర్యలు అందజేస్తుందని కేంద్రం తెలిపింది.
అత్యవసర సందర్భాల్లో, పౌరులు +963 993385973 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. అదనంగా, [email protected] అనే ఈ-మెయిల్ ఐడీ ద్వారా రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించింది.
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వంపై తిరుగుబాటు దళాలు దాడులు ముమ్మరం చేశాయి.
టర్కీ మద్దతుతో కొనసాగుతున్న ఈ తిరుగుబాటు చర్యలతో దేశంలో అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న ప్రభుత్వంపై తిరుగుబాటు దళాలు దాడులు ఉద్ధృతం చేయడం భద్రతా పరిస్థితిని మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
ఈ తరుణంలో, సిరియాలో ఉన్న భారత పౌరుల భద్రతే ముఖ్యమని కేంద్రం పేర్కొంది. భారత పౌరులు సాధ్యమైనంత త్వరగా సిరియా నుంచి భారతదేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది.