న్యూఢిల్లీ: కరోనా వైరస్ విరుచుకుపడిన నేపథ్యంలో అన్ని దేశాలు దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వేరే దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వారు ఖచ్చితంగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కలిగుండాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో వారు సంబంధిత వివరాలన్నింటినీ సదరు దేశ అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైట్లలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
ఎవరైతే అలా వ్యాక్సిన్ వివరాలు పాస్ పోర్ట్ వెబ్ సైట్లో నమోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్ తో కూడిన సర్టిఫికెట్లను ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉంటేనే వారిని విదేశీ ప్రయాణాలకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
ఈ విధానాన్ని ఈ సంవత్సరం తొలిసారి ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేషన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరి దగ్గరైతే ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉంటుందో వాళ్లను మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వెసలు బాటు కల్పించింది. ఇజ్రాయెల్ బాటలో మరికొన్ని దేశాలు కూడా ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను అమలులోకి తెచ్చాయి.
కాగా ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ప్రక్రియను భారత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకొద్ది రోజుల్లో జీ7 సమ్మిట్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో జీ 7 సమ్మిట్ కు సంబంధించి ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హర్షవర్దన్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వడం అనేది సదరు దేశాల పట్ల వివక్షత చూపించినట్లే అవుతుందని అన్నారు.
అలాగే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న, ఇంకా అభివృద్ధికి నోచుకోని దేశాలలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, సంబంధిత సమస్యలను పరిష్కరించడం, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల సరఫరా మరియు పంపిణీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హర్షవర్దన్ తెలిపారు. ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు అంటే దేశాల పట్ల వివక్షత చూపినట్లేనని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని భారత్ స్పష్టం చేస్తోందని అన్నారు.