దుబాయ్: అనుకున్న లెక్కలేవి కలిసి రాలేదు. జరగకూడదన్నదే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పై సునాయాస విజయంతో న్యూజిలాండ్ తమ సెమీస్ స్థానాన్ని పొందింది. వారి ఆ విజయంతో భారత్ సెమిస్ పై పెట్టుకున్న ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.
సోమవారం జరిగే నమీబియాతో మ్యాచ్ పూర్తి నామమాత్రంగానే మారిపోయింది. టోర్నీ మొదట్లోనే పాకిస్తాన్, న్యూజిలాండ్ తో ఓడిపోయిన భారత్ తిరిగి తరువాతి రెండు మ్యాచ్చుల్లో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ పై అద్భుతమైన విజయాల్ని నమోదు చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పుడే జరిగిపోయింది.
ఆదివారం మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ను 124 పరుగులకే కట్టడి చేసి లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేరుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ తమ 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి సెమీస్ లోకి దూసుకెళ్ళి, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ సరసన చేరింది. దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరలేక పోయింది.
టోర్నీ ముందు ఎంతో ఫాం లో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్చుల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ లను ఓడించి ఘనంగా సూపర్ 12 లో అడుగుపెట్టింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ప్రపంచ కప్ లో తొలి ఓటమిని చవిచూసింది. తరువాత న్యూజిలాండ్ తోనూ ఓడిపోయి సెమీస్ కి దూరం కావాల్సి వచ్చింది.
అయితే భారత్ టీ20 ప్రపంచ కప్ నుండి దూరం కావడంతో ఆ టోర్నీ కే కల తప్పుతుందని యావత్ క్రీడా నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.