న్యూఢిల్లీ: డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా ప్రదర్శన మొత్తం విరాట్ కోహ్లి కెప్టెన్సీపై ఆధారపడి ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. డిసెంబర్ 17వ తేదీన అడిలైడ్ వేదికగా జరుగనున్న ఆరంభపు మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరెట్ అని దాదా అభిప్రాయపడ్డాడు.
టెస్టు మ్యచ్చుల్లో సెంచరీలే విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఆస్ట్రేలియాలో ఎంత వరకూ సక్సెస్ సాధిస్తాడో అనే దాన్ని బట్టే భారత జట్టు యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడిన సౌరవ్ గంగూలీ, టీమిండియా ఖచ్చితంగా జట్టు నాణ్యమైన జట్టే, ఇప్పుడూ పేస్ ఎటాక్‌లో భారత్ చాలా బాగా పుంజుకుంది.
నవదీప్ సైనీ తన పేస్‌లో చాలా మెరుగయ్యాడు. గతేడాది కంటే సైనీ బౌలింగ్‌లో పదును పెరిగింది. ప్రతి ఒక్కరితో మంచి ప్రదర్శన చేయించడంపై కోహ్లి బాగా వర్క్ చేయాల్సి ఉంది. కెప్టెన్‌గా అతనకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తాడు. ఎవర్ని తుది జట్టులోకి తీసుకుంటాడో అనేది కోహ్లిపైనే ఆధారపడి ఉంటుంది, నేను ఒక ఆటగాడిగా మాత్రమే సలహా ఇస్తున్నానని గంగూలీ అన్నాడు.