న్యూఢిల్లీ: క్రమంగా ప్రప్రంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ ఈ పాటికే భారత్‌లోకి ప్రవేశించింది. తొలిగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఇవాళ దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగింది.
ఈ రెండు కేసుల్లో ఒకటి గుజరాత్ లోని జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి కొద్ది రోజుల క్రితమే జింబాబ్వే దేశం నుండి గుజరాత్ కు వచ్చినట్లు తెలిసింది. దీనితో భారత్‌లో ఈ ఒమిక్రాన్ కేసు మూడవదిగా నిలిచింది.
గురువారం ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు రాష్ట్ర హెల్త్ కమిషనర్ జై ప్రకాశ్ శివ్‌హారే తెలిపారు. బాధితుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు.
తదుపరి మహారాష్ట్రలో నాలుగవ ఒమిక్రాన్ కేసు కూడా ఇవాళే వెలుగు చూసింది. గత నెల చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా మహరాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకున్న మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.