న్యూఢిల్లీ: రోజురోజుకు వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులతో భారత్ రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను దాటేసి తాజాగా ప్రపంచంలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది.
64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు భారత్ 42,04,614 కేసులతో రెండో స్థానంలో, 41,37,606 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు చేరింది.
భారత్‌లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.30 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.70 శాతంగా ఉందని వెల్లడించింది.
గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు, రెండు రోజులుగా 90 వేలకు పైన కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 69,564 మంది కోలుకోగా 1,016 మంది మరణించారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.99% ఉన్నాయి.
శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని మీద ఉన్నవన్నీ ఊహాగానాలేనని, ఆధారసహిత ప్రయోగాలు లేవని అంటున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు తిరిగి కరోనా బారిన పడటం పట్ల ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోలజీ నిపుణులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
యాంటీబాడీలు కరోనాను పూర్తిస్థాయిలో నిరోధించడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు, ప్రస్తుతమున్న కేసుల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయని అన్నారు. శరీరంలో ఉన్న యాంటీబాడీల స్థాయిని తెలుసుకోకుండా కేవలం పాజిటివ్ లేదా నెగెటివ్ అని చెప్పడం వల్ల పూర్తి వివరాలు తెలియడం లేదన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం అమెరికావ్యాప్త ఆరోగ్య సంస్థ తో కలసి కోవాక్స్ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది.