హైదరాబాద్: మారిన ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్ లేకుండా, వాడకుండా ఒక గంట కూడా గడవడం కష్టమే. అంతలా ఈ ఉపకరణం జీవితంతో ముడిపడింది. భారత్‌లో సగటున ఒక్కో యూజర్ 4.48 గంటలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారని ఒక సర్వేలో ఈ విషయం తేలింది.
ప్రపంచంలోనే ఈ స్థాయిలో మొబైల్ వినియోగమే అత్యధికమని నోకియా తెలిపింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం గతేడాది నాలుగు రెట్లు వరకు పెరిగింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 ప్రకారం, మొబైల్‌లో సగటు 3జీ/4జీ డేటా వినియోగం నెలకు 2015లో 0.8 జీబీ నమోదైంది. ఇది అయిదేళ్లలో 17 రెట్లు అధికమై 2020లో 13.5 జీబీకి ఎగసింది.
అధికంగా వాడుతున్న ఈ డేటాలో 54 శాతం యూట్యూబ్ ని, సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలకు, 46 శాతం ఫిట్‌నెస్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్ వినియోగం అవుతోంది. 5జీ సేవల ప్రారంభానికి ఈ డేటా గణాంకాలు పునాదిగా ఉంటాయని నోకియా తన నివేదికలో వెల్లడించింది. 5జీ అందుబాటులోకి వస్తే డేటా గరిష్ట వేగం 1 జీబీకి చేరుతుందని నోకియా అంచనా వేస్తోంది.
ప్రపంచంలో మొబైల్స్ లో ఇంటర్నెట్ వినియోగంలో ఫిన్‌లాండ్ దేశం తర్వాతి స్థానంలో భారత్ ఉంది. కేవలం అయిదేళ్లలోనే 63 రెట్ల వరకు డేటా వృద్ధి జరిగింది. ఈ స్థాయి వినియోగంతో ఏ దేశమూ భారత్‌తో పోటీపడలేదని నోకియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్స్‌లో 2015 డిసెంబరులో భారత్‌లో 164 పెటాబైట్స్ డేటా వినియోగం అయింది.
షార్ట్ వీడియోలను ప్రతి నెల సగటున 18 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వీక్షిస్తున్నారు. 2016తో పోలిస్తే ఈ సంఖ్య 9 రెట్లు పెరిగింది. ఒక నెలలో 110 బిలియన్ నిముషాలు ఈ షార్ట్ వీడియోలు చూసేందుకు గడిపారు. 2025 నాటికి ఇది నాలుగు రెట్లు అధికం కానుందని అంచనా. షార్ట్ వీడియోల కంటెంట్ అధికంగా ఉండడంతోపాటు యువత వీటివైపే మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ డివైసెస్ విస్తృతం కావడంతో డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు.